25.9.06

విరాటరాజుగారి కథ



వెంకటేశ్వర్లుగారి చిన్నతనంలో మఱ్ఱిపూడిలో కంభంపాటి రామకృష్ణయ్యగారనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ప్రతిదానికి పెద్దగా అరిచేసేవాడట. ఎందుకో తెలీదు గాని ఆయనకి విరాటరాజుగారనే మారుపేరు ఖాయమైంది. కంభపాటి రామకృష్ణయ్య గారని అడిగితే ఊళ్ళో ఎవరికీ తెలిసేది కాదు. విరాటరాజుగారని అడగాల్సిందే.

ఆయనకి పన్నెండెకరాల భూమి ఉండేది.అది కాక శివాలయంలో అర్చకుడుగా ఉండేవాడు. కాని పరమ పిసినిగొట్టు. భక్తులు హుండీలో వేసిన బేడలన్నీ ఖర్చుపెట్టకుండా దాచేవాడు. ఆయన చనిపోయే నాటికి అవన్నీ కలిపి ఒక పెద్ద బస్తాడు పోగయ్యాయి. ఆయన భార్య ఒకసారి "ఏమండీ ! నోము చేసుకుంటానండీ ! నిమ్మకాయలు తెండి." అని అడిగిందట. విరాటరాజు పరమ పిసినిగొట్టు కదా, నిమ్మకాయల కోసం పైసలు ఖర్చుపెట్టడానికి మనసొప్పలేదు. "నిమ్మకాయల్లేవ్, జామకాయల్లేవ్, నా వట్టకాయలు పెట్టి చేసుకో నోము." అని యథాప్రకారం పెద్దపెద్దగా అరిచేశాడట. ఈ సంఘటన ఊరంతా చాలా దశాబ్దాల పాటు చెప్పుకున్నారు.

అదే ఊళ్ళో పంచాగ్నుల వెంకటేశ్వర్లుగారనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకీ రెండెకరాల పొలం ఉండేది. అయినా రోజూ మర్రిపూడిలో యాయవారం (ధాన్య భిక్ష)చేసేవాడు. ఎరుకల జాతికి చెందిన బూది అనే ఆమెని ఉంచుకున్నాడు కూడా ! బూది మీద విరాటరాజుగారి కన్ను పడింది. అప్పటికి వెంకటేశ్వర్లుగారికి పదేళ్ళుంటాయి. ఒకరోజు వెంకటేశ్వర్లుగారు ఆడుకోవడానికి పోతున్నప్పుడు చూశారట. విరాటరాజుగారు బూది చెయ్యి పట్టుకుని లాగుతున్నాడట. "డబ్బులిస్తా, రావే ! డబ్బులిస్తా, రావే !" అని లోగొంతుకలో తొందర పెడుతున్నాడట. విరాటరాజుగారి చెయ్యి ఎలాగో విడిపించుకుని బూది అదే పరుగు. ఈ సంరంభంలో విరాటరాజుగారి పంచె ఊడిపోయింది. ఆయన కూడా బట్ట సవరించుకుంటూ అదే పరుగు.

విరాటరాజుగారికి కొడుకులతో పాటు ఒక కూతురు కూడా ఉండేది. ఆవిణ్ణి బలిజేపల్లి కామశాస్త్రిగారికిచ్చి పెళ్ళి చేశారు. విరాటరాజుగారు ఎంత కష్టపడి డబ్బు కూడబెట్టాడో అంత సులభంగా దాన్నంతా ఖర్చు చేశారు, ఆయన సంతానమూ, అల్లుడూ ! బలిజేపల్లి కామశాస్త్రిగారు తరచుగా వెంకటేశ్వర్లు గారి దగ్గర అప్పు చేస్తూండేవాడట. ఆయన కొడుకుల్లో ఒకరు IPS కి ఎంపికయ్యారు. అతను 'శంకర్ ' పేరుతో మఱ్ఱిపూడిలో ప్రసిద్ధుడు. తాడేపల్లి వెంకటేశ్వర్లుగారు అతన్ని చిన్నతనంలో 'వెధవాయి శంకర్ ' అని పిలిచేవారట. అతను IPS అవుతాడని వెంకటేశ్వర్లుగారు ఎప్పుడూ అనుకోలేదట. సెలక్షన్ వచ్చాక ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కూడా డబ్బుల్లేకపోతే వెంకటేశ్వర్లుగారే సహాయం చేశారు. (అయితే అది అప్పు కాదు). అతను 1991 ప్రాంతంలో కేరళ రాష్ట్రానికి Inspector General అయ్యాడు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా అతను వెంకటేశ్వర్లుగారి పట్ల అత్యంత భక్తి ప్రపత్తులు చూపేవాడు.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్