రెండు పదుల సంఖ్యలో కూడా విద్యార్థులు చేరకపోవడం చేత 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్ని మూసివేసే ప్రతిపాదనలున్నట్లు ఒక అధికారి వెల్లడించారు. వాటిల్లో పనిచేసే సిబ్బందిని ఇతర ప్రభుత్వ సంస్థల్లోకి పంపుతామని కూడా తెలిపారు. అంతేకాక ఇతర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 100 గ్రూపులు ఎత్తెయ్యబోతున్నట్లు కూడా చావుకబురు చల్లగా చెప్పేశారు. మరి ఆ సిబ్బందిని ఏం చేస్తారో చెప్పలేదు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్కొక్క కళాశాలకీ రెండు-మూడెకరాల స్థలం ఉంటుంది. అంటే 9,300 చ.గజాల నుంచి 14,000 చ.గజాల దాకా అన్నట్టు. ఇది కాక 18 అంగుళాల మందంతో కట్టిన గోడలు గల రాజకోటల్లాంటి భవనాలుంటాయి. ఇంత హంగూ ఆర్భాటమూ ఉన్న విద్యాసంస్థల్లో ఎవరూ చేరకపోవడానికి కారణమేంటి చెప్మా ?
కారణం చాలా సరళమైనదే. విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పరమ తీసికట్టుగా ఉండడం. అదెందుకయ్యా ? అంటే, సమయానికి అధ్యాపకులు సిలబస్సులు పూర్తిచెయ్యలేకపోవడం. మళ్ళీ అదెందుకయ్యా ? అంటే, వాళ్ళు పనిచేసినా, చెయ్యకపోయినా ప్రిన్సిపాలు నోరెత్తలేని పరిస్థితి గనుక. మరి ఆయన అక్కడ ఎందుకున్నాడు ? అని అడిగితే, ఉన్నాడు పాపం ! ఆయన ప్రారబ్ధం కొద్దీ. రిజర్వేషను కోటాలో ఎంపికైన అధ్యాపకులు కులసంఘాలు పెట్టుకుని రాజ్యమేలుతుంటే ఆయనేం చెయ్యగలడు ? కొన్నిసార్లు ఆయన కూడా అదే కేటగరీ నుంచి వచ్చినవాడయితే, ఇహ చెప్పేదేముంది ?వారికి ఆ కేటగరీతో ఉద్యోగాలు ప్రమోషన్‌లూ సంపాదించుకునే హక్కుంది గాని, వారు పనిచెయ్యకపోయినా, చెయ్యరాని పనులు చేసినా అడిగే హక్కు మాత్రం ఎవరికీ లేదు.
ఖర్మ చాలక, ఆయన నోరుజారి ఒకసారి, "ఏమండీ ! మీరు సిలబస్సులు పూర్తిచెయ్యలేదని ఫిర్యాదులొస్తున్నాయి." అన్నాడో, ఇంక ఆయన పని అయిపోయిందన్నమాటే. ఆ అధ్యాపకుడు వెంటనే తన కులమార్బలంతో బజారుకెక్కుతాడు, " నన్ను కులం పేరుపెట్టి దూషించాడండీ ఈ ప్రిన్సిపాలు." అంటూ. అదే సదరు ముద్దాయి ఆ కుల స్త్రీ అనుకోండి. "ఈ ప్రిన్సిపాలు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు." అని దండోరా వేస్తుంది. "ఈ బాధలెందుకులే" అని ప్రభుత్వ ప్రిన్సిపాళ్ళందరూ నోరుమూసుకుని బ్రతకడం నేర్చుకున్నారు. ఈ నోరుమూసుకోవడమే ఇప్పుడు ఏకంగా కళాశాలల్నే మూసుకునిపోయే పరిస్థితికి కారణం.
సర్కారీ బళ్ళ చదువులు ఇంకా అధ్వాన్నంగా అఘోరిస్తున్నాయి. ఈ సంవత్సరం జిల్లా స్థాయి పాఠశాలా ఉపాధ్యాయుల ఎంపిక పరీక్షలకి 10,000 (అక్షరాలా పదివేలమంది) అభ్యర్థులు దరఖాస్తుల్లో తమ ఫోటోలు అతికించకుండా వేరే ఎవరివో ఫోటోలు అతికించారంటేనే మీకు అర్థమైపోవాలి అసలు ఉపాధ్యాయుల ఎంపిక స్థాయిలోనే జరుగుతున్న అవకతవకలు. ఈ రోజు కాలేజీల్ని ముయ్యడం మొదలయింది. రేపు దొరతనం వారి బళ్ళకి సైతం గొళ్ళెం పడుతుంది.
బ్రిటీషువారి కాలం దాకా అద్భుతంగా పనిచేసిన సర్కారీ విద్యాసంస్థలు ఆ తర్వాతి కాలంలో ఇలా నీచాతినీచంగా భ్రష్టుపట్టిపోవడానికి కారణం రిజర్వేషన్లు. ఏతావతా రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వసంస్థల్లో ఆప్యాయంగా పెంచి పోషించిన అసమర్థతకి అన్నింటికంటే ఎక్కువ బలైపోయింది తెలుగుభాష. జనం ప్రభుత్వ బళ్ళల్లో తమ పిల్లల్ని చేర్చడం మానేశాక తెలుగుభాషకి ఆదరణా, పోషణా కరువైపోయాయి.
