Monday, September 25, 2006

పిచ్చి బ్రాహ్మల కథ

1945 నాటి మాట. మఱ్ఱిపూడిలో దాసయ్యగారనే నియోగి బ్రాహ్మణుడు ఉండేవాడు. నిజానికి ఆయనది మఱ్ఱిపూడి కాదు. ఎక్కణ్ణుంచో వచ్చి మఱ్ఱిపూడిలో స్థిరపడిపోయాడు. ఆయన ఎంత బీదవాడంటే రోజుకొక ఇంట్లో భోంచేసేవాడు. దానికి తోడు ఏ పనీ చేతకాదు. శుద్ధ అమాయకుడు, తెలివితక్కువ వాడు. మఱ్ఱిపూడి ప్రాథమికంగా అగ్రహారం కావడం చేత బ్రాహ్మణుల జనాభా అధికం. అందుచేత ఏ పనీ చెయ్యకపోయినా ఆ అభిమానంతో ఎవరో ఒకరు ఆయనకి వేళకి అన్నీ సమకూర్చేవారు. అయితే నిష్ఠ దరిద్రుడు కావడాన ఎవరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. పెళ్ళి చేసుకోవాలని చాలాకాలం తాపత్రయపడ్డాడు. అది బొత్తిగా సాధ్యపడలేదు. చివరి దశలో ఆయనకి మతిస్థిమితం కూడా తప్పింది. ఆ వెర్రిలో ఇంట్లో ఒంటరిగా కూర్చుని అరుస్తూండేవాడట. "ముదనష్టం ముండా ! వచ్చి పాలివ్వాలని తెలీదూ, ఓ పక్క పిల్లాడేడుస్తుంటే !" జనం బయటినుంచే విని నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారట.

సుమారుగా అదే కాలంలో కంభంపాటి శర్మగారనే ఒకాయన మఱ్ఱిపూడికి వచ్చి స్థిరపడ్డాడు. ఆయన మెట్రిక్యులేషన్ చదివి రైల్వే స్టేషన్ మాస్టరుగా పనిచేశాడు. ఇంగ్లీషు భాషలో అపారమైన పాండిత్యం ఉండేది. తెలివితేటలు ముదిరి పిచ్చివాలకంలోకి దిగాడన్నారు వెంకటేశ్వర్లుగారు. అందుకే ఏవో తప్పుడు సిగ్నల్స్ ఇచ్చి రెండు రైళ్ళు గుద్దుకోవడానికి కారణమయ్యాడట. అందుచేత ఆయన్ని ఇంగ్లీషువాళ్ళు ఉద్యోగంలోంచి తీసేశారు. ఎంత పిచ్చివాడైనా ఆయన్ని కూడా మఱ్ఱిపూడివాళ్ళు ప్రేమతో ఆదరించి ఒక ఇల్లిచ్చి, వేళకి అన్నీ సమకూరుస్తూండేవారు.

కంభంపాటి శర్మగారు దేశభక్తుడు. ఆయనకి నిరంతరం దేశం గురించి ఆలోచించి ఆలోచించి మతిపోయింది. ఉద్యోగంలోంచి బర్తరఫ్ అవ్వడానికి ముందునుంచే ఆయనకి బ్రిటీషువాళ్ళంటే వల్లమాలిన ద్వేషం. మఱ్ఱిపూడిలో స్థిరపడ్డాక కూడా బ్రిటీషు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బెదిరిస్తూ దస్తాల కొద్దీ ఉత్తరాలు బ్రహ్మాండమైన ఇంగ్లీషు శైలి దంచుతూ రాసేవాడు. ఎవరికయ్యా అంటే మద్రాస్ గవర్నర్, వైస్రాయ్, గవర్నర్‌జనరల్, బ్రిటిష్ ప్రధానమంత్రి మొదలైన పెద్దతలకాయలకే ఏకంగా ! ఈ ఉగ్రవాది ఎవడో తెలుసుకుని ప్రభుత్వానికి అప్పగించమని ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఆదేశాలు అందుకుని పోలీసు బలగాలు దిగేవి మఱ్ఱిపూడి మీదికి. శర్మగారిని పట్టుకుని బహుమానం పొందాలని ఎంతో ఆశతో మద్రాస్ నుంచి పోలీసు ఉన్నతాధికారులు వచ్చేవారు. కొండని తవ్వి ఎలకని పట్టినట్లు ఇంతా చేసి ఆయన పిచ్చివాడని తెలుసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. ఈ తతంగం ఏడాదికి రెండుమూడు సార్లయినా జరిగేది. మొత్తం మీద శర్మగారు ఒక్కసారి కూడా అరెస్టు కాలేదు.

ఎంత మతి భ్రమించినా శర్మగారు స్నానం, బట్టలు, భోజనం లాంటి విషయాల్లో మామూలుగానే ఉండేవాడట.

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.

రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.

మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.