Friday, May 16, 2008

ఆ దెబ్బ దేవేంద్రలోకం

నేనొకసారి ఒక మహాపరాధం చేశాను. మా నాన్నగారు నన్ను చావగొట్టే ఉద్దేశంతో నా వెంటపడ్డారు. నేను తప్పించుకుని పారిపోయాను. ఆయన నామీద కేకలేస్తూ కొంతదూరం వఱకు నన్ను తరిమారు. ఆ తరువాత వయోభారంచేత నాతో సమానంగా పరిగెత్తలేక ఒకచోట నీరసంగా కూలబడ్డారు. చాలాసేపటి తరువాత నేను మళ్ళీ ఇంట్లోకి వచ్చాను. ఆయన కంటపడకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను. (నేనాయన కంటపడలేదని నేననుకున్నాను). తరువాత ఆయన ఎదుటపడ్డప్పుడు నాకు తన్నులు తప్పవనుకున్నాను. కాని ఆయన ఆ విషయమే ఎత్తలేదు. కాని ఆయన నన్ను క్షమించలేదని నాకు తెలుసు. కాని నేను చాలా ఆనందించాను. తరువాత కొద్ది సంవత్సరాలకు ఆయన చనిపోయారు.

వెనక్కి తిరిగి చూసుకుంటే నాన్నగారిని అంత కష్టపెట్టి ఉండాల్సింది కాదని అనిపిస్తుంది. నేను ఆయనకు లొంగిపోయుంటే బావుండేది. నన్నాయన చావగొట్టి ఉంటే బావుండేది. తన్నులు తప్పాయని ఆనందించడం ఒక పిల్లచేష్ట. నా అపరాధం శిక్షించబడకుండా అలాగే మిగిలిపోయింది. దానిగుఱించి నన్ను దండించడానికి ఎవరికైతే సర్వాధికారా లున్నాయో ఆయన్ని నేనా పని చెయ్యనివ్వకపోవడం వల్ల, ఆ పనిని అలాగే ఉంచి ఆయన చనిపోవడం వల్ల, ఆ పని చెయ్యడానికి ఇంకెవరికీ అధికారం లేకపోవడం వల్ల అది ఇంకొక న్యాయస్థానంలోకి వెళుతుంది. అక్కడ కేవలం కొద్దిపాటి చావగొట్టుడుతోనే విషయం సరిపెట్టబడదు.

"ఆయన నన్ను కొట్టి ఉంటే బావుండేది" అని ఎవరో ఒక భార్య
"అన్నయ్య నన్ను తన్ని ఉంటే బావుండేది." అని ఎవరో ఒక తమ్ముడు
"అమ్మ నా చెంప పగలగొట్టి ఉంటే బావుండేది" అని ఎవరో ఒక కూతురు
ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటారు.

కుటుంబసభ్యులు చేసే తప్పులకు కుటుంబాధిపతి/కుటుంబాధికారిణి వారిని ఎప్పటికప్పుడు తగువిధంగా శిక్షించాలి. నిర్మొహమాటంగా నిర్మమంగా నిరహంకారంగా శిక్షించాలి. తెలిసీ శిక్షించకపోతే ఆ పాపాల్లో సగం అతనికి/ఆమెకు చుట్టుకుంటాయి. తరువాత ఆ కుటుంబసభ్యులు కూడా - అతడు విధించే శిక్షలకన్నా భయంకరమైనవాటిని భగవంతుడి చేతిలో అనుభవించాల్సి వస్తుంది. భగవత్ స్వరూపుడైన కుటుంబాధిపతి వేసే శిక్షలు గోటితో పోయేవి. మన పాపాల్ని అవి అనేక జన్మలకు వాయిదా వెయ్యకుండా ఇప్పటికిప్పుడే సూక్ష్మంలో పోగొట్టేస్తాయి. కాని భగవంతుడే స్వయంగా శిక్షించాల్సి వస్తే ఆయన గోళ్ళు వాడడు. ఖచ్చితంగా గొడ్డళ్ళే వాడతాడు. ఆ అనుభవం మానవులకు బహుబాధాకరంగా దుర్భరంగా ఉంటుంది. కనుక కుటుంబాధిపతి చేతిలో శిక్ష అనుభవించడం వీలుపడకపోతే తత్సమానులైన పెద్దల సమక్షంలో తప్పు ఒప్పుకుని వారు విధించగల ప్రాయశ్చిత్తానికి పాత్రులు కావాలని శాస్త్రం.

భగవంతుడి శిక్షలు ఎక్కువ బాధాకరంగా ఉండడానికి కారణం ఆయన క్రూరుడు కావడం కాదు. అందుకు విరుద్ధంగా ఆయన మనందరికంటే నిస్స౧దేహంగా పరమ దయామయుడు. అసలు కారణం - పాపమైనా పుణ్యమైనా అనుభవించకుండా పేరబెట్టేకొద్దీ, ఆ అనుభవాన్ని వాయిదా వేసేకొద్దీ అది "ఇంతింతై వటుడింతై" అన్నట్లుగా పెరిగి పోతూంటుంది. అంటే పాపం చెయ్యడానికీ, దాని ఫలితాన్ని అనుభవించడానికీ మధ్య ఎక్కువ ఎడం (gap) ఉండకూడదు. కుటుంబాధిపతి తక్షణం వేసే శిక్ష అలాంటి ఎడమేదీ ఏర్పడకుండా మనల్ని కాపాడుతుంది. ఉదాహరణకు - మీరొక దీపం పక్కన చెయ్యి పెట్టినప్పుడు మీ చేతికీ దాని నీడకీ నడుమ ఎడం పెరిగిపోయేకొద్దీ మీ చేతి నీడ పరిమాణం కూడా వందలాదిరెట్లుగా పెరిగిపోతుంది.

Sunday, May 11, 2008

మహిళా రిజర్వేషన్ - మరో కోణం - 2

పూర్వం అందరికీ కలిపి ఒకటే ఇండియా ఉండేది. ఇప్పుడు రెండు ఇండియాలు ఉద్దేశపూర్వకంగా సృష్టించబడ్డాయి. ఒక ఆడ ఇండియా. ఒక మగ ఇండియా. మహిళలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలూ, ప్రత్యేక కమిషన్లు, ప్రత్యేక న్యాయస్థానాలు, మగవాడికి మాత్రమే వర్తించేవీ, ఆడదానికి వర్తించనివీ అయిన ప్రత్యేకమైన అమానుష చట్టాలు - అన్నీ ప్రత్యేకమే. ఇప్పుడేమో ప్రత్యేక నియోజకవర్గాలట. సమానత్వాన్ని అంగీకరించినచోట ప్రత్యేకాలెందుకో ఎవరూ చెప్పరు.

ఇవన్నీ ప్రత్యేకంగా తమక్కావాలని వాళ్ళెప్పుడైనా అడిగారా ? ఉన్న వ్యవస్థల్లోను, చట్టాల్లోను మహిళలకూ, వాళ్ళ సమస్యల పరిష్కారానికీ స్థానం లేదా ? లేక అంతకు ముందున్న వ్యవస్థలు ఉద్ధరించలేనిదేదో కొత్త వ్యవస్థలు ఉద్ధరించి చూపుతాయనా ? మఱి ప్రత్యేక వ్యవస్థల్ని ఎందుకు ఏర్పఱుస్తున్నారు ? వీటన్నింటి వెనుకా ఎవరున్నారు ?

కరుడుగట్టిన ఫెమినిస్టులు. యావత్తు మగజాతి మీద అకారణంగా కక్షగట్టినవాళ్ళు. పైకి సమానత్వం మాట్లాడుతూ లోపాయికారీగా మగవాళ్ళని నిస్సహాయుల్ని చేసి ఒక ఆట ఆడిద్దామని తీవ్రంగా కృషిచేస్తున్నవాళ్ళు. స్త్రీల మెప్పు కోసం తహతహలాడుతూ అందుకోసం సాటి మగవాణ్ణి బద్నామ్ చెయ్యడానికి వెనుకాడని వాళ్ళు. రాజకీయ నాయకులు. ఎఱ్ఱజెండాలు. నోరువిప్పి నిజం మాట్లాడితే ఎక్కడ జనం దృష్టిలో అభ్యుదయ వాదులం కాకుండా పోతామోనని భళాభళీ, తానతందానా కొట్టడాన్ని అదే పనిగా అభ్యసించిన మీడియా. వాస్తవానికి వాళ్ళంతా కలిపితే మొత్తం జనాభాలో అతిసూక్ష్మ మైనారిటీలు మాత్రమే. కాని వాళ్ళు బృహత్తరమైన మెజారిటీ జనవాహిని యొక్క అభిప్రాయాన్ని గుత్తకు తీసుకున్న విధానం దిగ్భ్రాంతి కలిగిస్తుంది.

మహిళల విషయాలు ఒక సమగ్రచిత్రంలో ఏకదేశమే తప్ప అవి తాముగా ఒక సమగ్రచిత్రాన్ని ఏర్పఱచజాలవు. సమకాలీనంగా మహిళలకు చట్టసభల్లో గల అఱకొఱ ప్రాతినిధ్యాన్ని సైతం ఈ కోణంలోంచి అవగాహన చేసుకోవాల్సి ఉంది. దేశంలో చట్టసభలకు ఎన్నిక కావడం అందని మ్రానిపండైన వర్గాలు చాలానే ఉన్నాయి. అసలు సమస్య - మన ఎన్నికల ప్రక్రియ బహుఖరీదైనది కావడం. అందువల్ల మన దేశంలో కోట్లాదిమంది మగవాళ్ళు కూడా తమ గ్రామపంచాయితీలో వార్డుమెంబరుగా నైనా పోటీచెయ్యజాలని దీనావస్థలో ఉన్నారు. మహిళల పరిస్థితైనా ఇందుకు భిన్నంగా ఉండదు. ఈ విధంగా గత 60 ఏళ్ళుగా రాజకీయ అస్పృశ్యులైన ఈ పేదవర్గాల్ని ప్రజాస్వామ్య ప్రధానవాహినిలోకి తేవడానికి కారుచౌకయిన మార్గాలేమైనా ఉన్నాయా ? అని ఆలోచించిన పాపాన పోలేదీ భారతప్రభుత్వం, మళ్ళీ మళ్ళీ వాళ్ళ వోట్లు కొని గద్దెనెక్కడంలో తరణోపాయాన్ని చూసుకుంది తప్ప. అలాగే కవులూ, కళాకారులూ, పాత్రికేయులూ, పండితులూ, మతగురువులూ, వివిధ రంగాల్లో నిష్ణాతులైన ఇంజనీర్లు, వైద్యులూ, పదవీవిరమణ చేసిన సైనికులూ, క్రీడాకారులూ, సంఘసేవకులూ - ఇలా తమ జన్మలో ఎన్నడూ కనీసం ఒక గ్రామపంచాయితీ భవనాన్ని గాని మునిసిపల్ కౌన్సిల్ ని గాని చూసి యెఱగని మగవాళ్ళు మిలియన్లాదిగా ఉన్నారు. వీళ్ళందరి ప్రధాన సమస్యా ఒక్కటే - ఎన్నికల్లో పోటీ చేయడానికి కావాల్సిన ఆర్థిక పుష్టి కొఱవడ్డం.
వాస్తవానికి రాజ్యసభ మొదట్లో ఇలాంటివాళ్ళకోసమే ఉద్దేశించినట్టిది. కాని అది కూడా ఇప్పుడు ఫక్తు వృత్తిరాజకీయ నాయకులతో నిండిపోయింది.

సౌమ్యులూ, హింసచెయ్యడం లేదా హింసని అడ్డుకోవడం చేతకానివాళ్ళూ మన దేశంలో చట్టసభలకు ఎన్నిక కాలేరనుకుంటే పైన పేర్కొన్న తరహా మగవాళ్ళంతా ఆ శ్రేణిలోకే వస్తారు. మహిళలూ ఆ శ్రేణిలోకే వస్తారు. అందుచేత అసలైన పరిష్కారం ఉన్నది ఎన్నికల్లో ధనస్వామ్యానికి అడ్డుకట్ట వేయడం దగ్గర ! అంతేగాని ఒక్కొక్క లింగానికీ, వర్గానికీ ఇంత చొప్పున రిజర్వేషన్లు కల్పించడం దగ్గర కాదు. అలా కల్పిస్తున్నామంటే మనం అసలు సమస్య నుంచి మొహం చాటేస్తున్నట్లే. ఈ విధానం ఫలవంతం అయ్యే ఆస్కారం లేదు. ఫలితార్థంగా ఏం జరుగుతుందంటే - ఈ ప్రతిపాదిత 33 శాతం రిజర్వేషన్ని డబ్బున్న ఆడవాళ్ళే గద్దల్లా తన్నుకుపోతారు. వాళ్ళు సాధారణంగా మగనాయకుల భార్యలో, ఉపభార్యలో, కూతుళ్ళో, కోడళ్ళో అయ్యుంటారు. చాలా సందర్భాల్లో ఇద్దరూ పక్కపక్క నియోజకవర్గాల్లోనే నిలబడే అవకాశం ఉంది. అంటే గుంటూరులో భర్త, తెనాలిలో భార్య అన్నట్లు.

కనుక ప్రతిపాదిత రిజర్వేషను నుంచి సమూలమైన మార్పుల్ని (radical changes) ఆశించలేము. చట్టసభల్లో జరీచీరల ధగధగలు మఱికొంత ప్రకాశమానమౌతాయేమో ! లేదా కొందఱు ఫెమినిస్టులకు మాంఛి కిక్కు, థ్రిల్లు కలుగుతుందేమో ! అంతకన్నా పెద్దగా ఏమీ జరగదు. అయితే ఈ బిల్లు పాసైన తరువాత కూడా ఫెమినిస్టుల Devil's work-shop చుఱుగ్గా పనిచేస్తూనే ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. మగవాళ్ళ నుంచి ఇంకా ఇంకా ఏమేం కొట్టెయ్యాలా ? అనే నిరంతరచింతతో వాళ్ళు అనుదినం సరికొత్త నిలదీతల (Demands) తో ముందుకొస్తూ నే ఉంటారు.మగవాళ్ళకు బుద్ధిలేకపోతే వాళ్ళు ఆడింది ఆటగా పాడింది పాటగా అన్నీ సాధించుకుంటూ పోతారు.

(సమాప్తం)

Wednesday, May 07, 2008

మహిళా రిజర్వేషన్ - మరో కోణం

మహిళల రాజకీయ ప్రాతినిధ్య ప్రత్యేకింపుల ప్రతిపాదనాపత్రం (Reservations Bill) నిన్న రాజ్యసభలో ప్రవేశపెట్టబడింది. దీని గుఱించి వార్తాపత్రికలందించిన కథనం మాత్రం చాలా ఎబ్బెట్టుగా ఉంది. అపరిణతం(immature)గా కూడా ఉంది. సాక్షిపత్రికైతే "మగ గండాలు గడిచిన మహిళాబిల్లు" అని పతాకశీర్షిక(banner head) పెట్టింది. ఏంటో పాపం ! ఆడవాళ్ళు చట్టసభల్లో ప్రవేశిస్తే మగవాళ్ళ అధిపత్యానికి గండిపడుతుందని యావన్ మగజాతీ యమా ఆందోళన చెందుతున్నట్లూ, "భగవంతుడా ! ఈ బిల్లు పాసవ్వకుండా చెయ్యి' అని రోజూ శతకోటిమంది దేవుళ్ళకు మొక్కుకుంటున్నట్లూ బిల్డప్పు. అలాంటి మగవాళ్ళున్న దేశాలు ఆసియా ఖండానికి పడమట కొన్ని ఉన్నాయి. భారతీయ పురుషులకు ఆ క్లబ్బులో సభ్యత్వం లేదు. అలాంటి సామాజిక వాతావరణమే గనక నిజంగా ఇక్కడ ఉండి ఉంటే ఇలాంటి బిల్లుల్ని మన పేరోలగంలో ప్రవేశపెట్టడానికి ఎవరూ సాహసించేవారు కారు. కాని వాస్తవిక దృక్పథంతో ఆ విశాల హృదయాన్ని ఈ దేశపు మగవాళ్ళకు ఆపాదించడానికి, నెనర్లు (thanks) చెప్పడానికీ ఫెమినిస్టులు గానీ వాళ్ళచేత ప్రభావితమౌతున్న ప్రసారమాధ్యమాలు గానీ సిద్ధంగా లేరు. దీనికంతటికీ కారణం మీడియా. మగవాళ్ళకు అది చేస్తున్న అపకారం సాటిలేనిది. It's extremely hurtful. అందుకని నాకనిపిస్తుంది - ముందో వెనకో మన పురుష మీడియాని మనమే రూపొందించుకోవాల్సిన తరుణం సమీపిస్తోందని !


భారత పేరోలగం (Indian Parliament) లో ఆడవాళ్ళు 180 మంది ఉన్నా 360 మంది ఉన్నా పరిస్థితిలో పెద్ద మార్పుంటుందని నేననుకోను. ఇక్కడ పార్టీయే దేవుడు. అంతిమంగా పేరోలగంలో ఆడ-మగ ఫీలింగులు పనిచెయ్యవు-పార్టీ అజెండా తప్ప ! అసలు విషయం అది కాదు. పత్రికలు చిత్రిస్తున్నట్లుగా ఇది ఆడ-మగ మధ్య రాజకీయ యుద్ధం కాదు. రాజకీయపార్టీల అభ్యంతరాలకు అసలు కారణం - 33 శాతం స్థానాలంటే లోక్ సభలో ఇప్పుడున్న180 మంది సభ్యుల్ని ఆ స్థానాల్లో మళ్ళీ పోటీచెయ్యకుండా అనర్హుల్ని చెయ్యడం. వాళ్ళని బలవంతంగా రాజకీయాల్లోంచి విరమింపజెయ్యడం. ఏ నాయకుడికి మాత్రం అలాంటిది ఇష్టం ఉంటుంది ? ఎందుకంటే రాజకీయనాయకుడనేవాడు పెంగ్విన్ పక్షుల్లాగా, ధ్రువపు టెలుగుబంటు (Polar Bear) లాగా ఒక ప్రత్యేక భూభాగానికి నిబద్ధుడైన జంతువు. ఆ భూభాగం (habitat) దాటితే వాడు రాజకీయంగా చస్తాడు. ఈరోజు మగవాళ్ళని ఆడిపోసుకుంటున్నారు గాని రేపు స్త్రీలకు కేటాయించిన స్థానాల్ని ఏ కారణం చేతనైనా General Category లోకి మారుస్తామంటే మహిళా ఎంపీలు సరిగ్గా ఇదే రకమైన గగ్గోలు లేవదీస్తారు.

ఇలా స్త్రీలకు సంబంధించిన ప్రతివిషయంలోను మగవాణ్ణి విలన్ గా, శత్రువుగా, ప్రత్యర్థిగా పోటీదారుగా ఎందుకు చిత్రిస్తారో నాకు అంతుపట్టని సంగతి. ముఖ్యంగా మగవాడికి అలాంటి రికార్డు ఏదీ లేకపోయినా ! వాస్తవానికి ఇప్పుడు ఆడవాళ్ళు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలూ, ప్రివిలీజెస్ వాళ్ళకోసం మగవాళ్ళే పోరాడి సాధించిపెట్టినవి. ఫెమినిస్టులూ, ఎఱ్ఱజెండాలూ ప్రచారం చేస్తున్నట్లు ఆడవాళ్ళు రక్తమో, మఱొకటో చిందించి సాధించుకున్నవి కానేకావు. ఇప్పటికీ ఆడవాళ్ళని చదువుకొమ్మనీ, ఉద్యోగాలు చెయ్యమనీ ప్రోత్సహిస్తున్నది మగవాళ్ళే. అది తండ్రి కావచ్చు ,భర్త కావచ్చు, చదువు చెప్పిన మాష్టారు కావచ్చు.

కాని మగవాడి మంచితనానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను ప్రచారం ఇవ్వకూడదు. వాణ్ణి ఇప్పటికే అందరి దృష్టిలోను వెధవన్నర వెధవని చేసేశాం. వాడలా ఆచంద్రతారార్కం కొనసాగాల్సిందే. మగవాళ్ళు కూడా ఫెమినిస్టుల పాచిపాటే పాడుతున్న పరిస్థితుల్లో వాడి మూర్తిమత్త్వం (ఇమేజి) ఇప్పట్లో మెఱుగుపడే అవకాశం లేదు. వాడు స్వతహాగా మంచివాడని ఒప్పుకుంటే ఆడవాళ్ళంతా సుఖపడిపోతున్నట్లే అవుతుంది. అప్పుడు ఆడవాళ్ళ సౌలభ్యార్థం చేసే ప్రత్యేక చట్టాల నిలదీతలు (డిమాండ్లు) తుస్సుమంటాయి. అమ్మమ్మ ! అది ఎట్టి పరిస్థితుల్లోను కుదరదు. మగజాతి ఆడజాతిని ఇంకా ఇంకా దారుణంగా అణిచేస్తున్నట్లే మొహం పెట్టాలి. ఒకపక్క "సమానం" అంటూనే మగవాళ్ళక్కూడా చరిత్రలో ఎన్నడూ లేని అనేక హక్కుభుక్తాలు ఆడవాళ్ళు విఱివిగా సంపాదించాలి.

ప్రతి కథలోను ఒక కథానాయకుడు (హీరో), ఒక కథానాయిక (హీరోయిను), ఒక ప్రతినాయకుడు (విలను), ఒక హాస్యగాడు (కమెడియనూ) ఉండితీఱాలి. ఫెమినిస్టుల కథలో ఎల్లప్పుడూ ఆడదే ఏకకాలంలో కథానాయకుడు, కథానాయిక కూడా ! అలాగే ఆమె పాలిట మగవాడే ఎల్లప్పుడూ ఏకకాలంలో ప్రతినాయకుడు, హాస్యగాడు అవుతాడు. ఒక చెడ్డమగవాడు యావన్ మగజాతికీ ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే ఒక మగవాణ్ణి చూసి అసలు మగజాతంటే ఏంటో ఇట్టే గ్రహించిపారెయ్యొచ్చు. కాని చెడ్డదని బయటపడ్డ ఒక ఆడది అందరు ఆడవాళ్ళకీ ప్రతినిధి కాజాలదు. ఆమె స్త్రీజాతికే కళంకం. ఎందుకంటే మిగతా ఆడవాళ్ళంతా చాలా మంచివాళ్ళు. వాళ్ళందరిలో ఒక తల్లినీ, చెల్లినీ మనం చూసుకోవాలి. వాళ్ళలో చెడ్డవాళ్ళు అరుదుగా ఉంటారు. ఒకవేళ ఏ స్త్రీ అయినా చెడ్డదైతే అందుకు మగవాడిదే బాధ్యత.

ఎందుకు చెబుతున్నానంటే - స్త్రీలకి రాజకీయ రిజర్వేషనే కాదు, ఎవరికి ఎలాంటి రిజర్వేషనివ్వాలన్నా నేను నిర్ ద్వంద్వంగా రాజీలేకుండా వ్యతిరేకిస్తాను. ఇలాంటి రిజర్వేషన్లన్నింటి వెనకా ఉండేది ఇలాంటి ఒక సుదీర్ఘకాలపు బాధితత్వ ప్రచారం (chronic victimization propaganda) . ఫలానా వర్గంవాళ్ళు చాలాకాలంపాటు బాధలు పడ్డారు. దానికి ఇతరులే కారణం. ఎందుకంటే ఇతరులు వాళ్ళని అణిచేశారు. ఆ వర్గంవాళ్ళకి మాత్రం తమపట్ల తమకు ఏ బాధ్యతా లేదు. కాబట్టి మనమందరం కలిసి ఇప్పుడు వాళ్ళ నడ్డిపట్టుకుని అర్జెంటుగా ఎత్తాలి. ఎందుకంటే వాళ్ళు బహుశా ఎప్పుడో ఎక్కి ఉండాల్సిన స్వప్నసింహాసనాల్ని మనమే అక్రమంగా ఎక్కేశాం గనుక మనం వాళ్ళకు జన్మజన్మలకూ ఋణపడిపోయాం. రిజర్వేషన్ల ద్వారా మనమిప్పుడా ఋణం తీర్చుకోవాలి.

ఇలా ఎదుటివాళ్ళ మానవహక్కుల్ని వ్యవస్థాపరంగా శాశ్వతంగా సమాధి చేసేవీ, మిగతా యావత్ జనాభాని చట్టపరంగా డీరికగ్నైజ్ చేసేవీ రిజర్వేషన్లు. ఇతర్లని వ్యక్తిగత ప్రతిభా పాటవ ప్రదర్శనలో బహిరంగంగా ఎదుర్కోలేక తమ మందబలాన్ని, ఓట్లనీ అడ్డంపెట్టుకుని ప్రభుత్వం యొక్క మెడలు వంచి సాధించుకునే అక్రమమైన, నీచమైన దొడ్డిదారి రిజర్వేషన్లు. పసిపిల్లల్ని ఎత్తుకుని అడుక్కునే బిచ్చగాళ్ళలాగా, శవంమీది డబ్బులేరుకునేవాళ్ళలాగా తమలో ఉన్న కొద్దిమంది అభాగ్యుల్ని చూపించి తాము శాశ్వతంగా పీఠాలెక్కడానికి పన్నిన కపటవ్యూహం రిజర్వేషన్లు. సగటు-సరాసరి మేధావులకు తప్ప అవి ఎవరికీ ఉపశమనం కాదు, ఎవరికీ ఉపకరించవు. ఒకసారి వాటిని ప్రవేశపెట్టాక ఇహ వాటిని ఈ యుగాంతానికైనా రద్దుచెయ్యడం ఎవరివల్లా కాదు. అవి మొదట్లో ఈ వర్గానికి ఇంత శాతం అంటూ మొదలవుతాయి. తరువాత్తరువాత కాలక్రమంలో హెచ్చుశాతం వోట్లున్న వర్గాల వాటాలే నిజమౌతాయి. మిగతావాళ్ళ వాటాలు మాత్రం వట్టిమాటలుగా మిగిలిపోయి రాజ్యాంగంలో విశ్రాంతి తీసుకుంటాయి. అగ్రకులాలతో సహా ప్రతివాణ్ణీ ఏదో ఒక రిజర్వేషన్ కేటగరీలోకి తెచ్చి ఈ అన్యాయానికి, ఈ అక్రమానికి ఈ సమానత్వవిరుద్ధానికీ, ఈ ప్రజాస్వామ్యద్రోహానికీ సువిశాల ప్రజానీకం యొక్క ఆమోదముద్ర సంపాదిద్దామనే ప్రతీప ధోరణి గత కొద్దికాలంగా బయల్దేరింది. ఈ జబ్బు మొదట తమిళనాడులో ఆరంభమై ఇప్పుడు యావద్దేశానికీ అంటుకుని నరనరాలా వ్యాపించి ప్రాణాంతకంగా ప్రకోపించింది..

మహిళా రిజర్వేషన్ బిల్లుని సైతం ఈ కోణంలోంచే చూడాల్సి ఉంది. ఇందులో ఇంకొన్ని కోణాలు కూడా ఉన్నాయి. చాలాకాలం నుంచి నా మనసుని తొలుస్తున్న ప్రశ్న - మన కులంవాడో మన మతంవాడో కాకపోయినంతమాత్రాన మన పరిపాలకుడు మనకు మేలుచెయ్యడా ? చెయ్యడని మనం అనొచ్చునా ? "మన"వాడైనంతమాత్రాన ప్రతిపాలకుడూ మనకు మేలుచేశాడా ? ఎవరున్నారనేదానికన్నా ముందు మనకు మేలు జరగడం ప్రధానం కాదా ? అలాగే ఆడవాళ్ళైతేనే ఆడవాళ్ళకు మేలుచేస్తారా ? మగవాళ్ళు మేలుచెయ్యరా ? గతంలో చెయ్యలేదా ? ఆడవాళ్ళని ఆడవాళ్ళే అర్థం చేసుకుంటారన్నప్పుడు, ఏ విషయంలో ? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆడ విషయాల్లోనే అయితే అందుకు గైనకాలజిస్టులు సరిపోతారు. కాని ఆడవాళ్ళని ఆడవాళ్ళే అర్థం చేసుకుంటారంటే మఱి వాళ్ళకు ఓట్లేసే విధంగా రాజ్యాంగబద్ధంగా మెడలు వంచబడ్డ సదరు ఆడనియోజకవర్గపు మగవోటర్లని ఎవరు అర్థం చేసుకోవాలి ?

మన అనుభవంలో, మనకు తెలిసి మన మహిళా ప్రతినిధులందరూ ఎప్పుడూ ఆడవాళ్ళ గుఱించే మాట్లాడతారు. తమని ఆడా, మగా అందరూ కలిసి ఎన్నుకున్నారనే ఇంగితజ్ఞానం వాళ్ళకున్నట్లు కనిపించదు. లేదా మగవాళ్ళకి ఏ సమస్యలూ లేవనుకుంటారో ఏమిటో ! రేణుకా చౌదరి ఎప్పుడూ ఆడవాళ్ళ గుఱించే మొత్తుకుంటూ ఉంటుంది. ఆమె తనకింద పనిచేసే మగ ఉద్యోగుల మీద భౌతికంగా దాడిచేసి చితక్కొట్టడంలో అనిర్వచనీయమైన ఆత్మానందాన్ని పొందుతుంది. ఆ క్రమంలో ఆమె గతంలో ఢిల్లీలో ఒక పోలీసుని స్వయంగా స్వహస్తాలతో చితక్కొట్టి అభియోగాన్ని (court case) కూడా ఎదుర్కుంది. అలాగే మన అధ్యక్షురాలు ప్రతిభాపాటిల్ ఎప్పుడూ ఆడవాళ్ళ సంక్షేమం గుఱించే మాట్లాడుతుంది. నేదురుమల్లి రాజ్యలక్ష్మి ప్రభుత్వ వేడుకల్లో ఒక్కొక్కప్పుడు ఫెమినిస్టులాగా మగవాళ్ళమీద రెచ్చిపోతూంటుంది. ఈ ప్రభుత్వానికి మగవాళ్ళు అక్కఱలేదా ? మగవాళ్ళు పన్నులు కట్టడంలేదా ? ఇందులో ఉన్న తప్పు వాళ్ళంతట వాళ్ళకు గోచరించడం లేదా ? ఏ రిజర్వేషనూ లేనప్పుడే మగవాళ్ళ పట్ల మహిళా ప్రతినిధుల ప్రవర్తన ఇలా అఘోరించిందే, మఱి మహిళా రిజర్వేషన్ ద్వారా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వెళ్ళినవాళ్ళు తమ పూర్తికాలాన్ని (ఆడా, మగా తేడా చూపించకుండా) యావత్ ప్రజానీక శ్రేయస్సు కోసం వెచ్చిస్తారంటే నమ్మేదెలా ? వాళ్ళు తమ "ఆడగుర్తింపు"ని అనుక్షణమూ నొక్కివక్కాణించి చెప్పుకోవడానికే పుణ్యకాలాన్ని వెచ్చిస్తారనీ తాము ఏ సేవా చెయ్యకపోయినా, తాము ఆడవాళ్ళం కనుక తమని ఎవరూ ఏమీ అనకూడదనే విధంగా తలబిరుసు ప్రదర్శిస్తారనీ నాకొక అనుమానం.

రాజకీయాలూ, రాజ్యాధికారమూ అనేవి సహజనాయకత్వ లక్షణాలకు సంబంధించినవి. అవి తప్పనిసరిగా పుట్టుకతో రావాల్సిందే. శిక్షణిచ్చి గాని ఇంజెక్షనిచ్చి గాని రిజర్వేషనిచ్చి గాని మీరు ఎవ్వరినీ నాయకుడుగా/నాయకురాలుగా రూపొందించజాలరు. కొందరు నాయకులు కాగలగడానికీ, కొందరు కాలేకపోవడానికీ ఎవడో పనిగట్టుకుని అణగదొక్కడం కారణం కానేకాదు. నిజంగా పరిజ్ఞానమూ, వాగ్ధాటి, ధైర్యమూ, సంఘటక శక్తి (organizing ability) కలిగినవారిని - వారు ఆడైనా, మగైనా నాయకత్వం వహించకుండా ఆపగలిగినవాడెవడూ లేడు - అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ! ఇతర బ్లాగుల కన్నా మీ బ్లాగునే అందరూ ఎక్కువగా చదవడానికి మీ బ్లాగులో స్వయంసిద్ధమైన పస ఉండడమా కారణం ? లేక మీరు ఇతరుల బ్లాగుల్ని అణగదొక్కడమా ? మఱి అదే వర్తిస్తుంది రాజకీయానిక్కూడా ! అందులోను ప్రజాకర్షణతో ముడిపడ్డ ప్రజాస్వామ్యంలో !

అందుచేత నేనెప్పుడూ చెప్పేదొకటే - Give nature a chance. Give spontaneity a chance. రిజర్వేషన్లనేవి ఈ సహజమైన నాయకత్వ ప్రతిభ వికసించే ప్రక్రియకు మానవకల్పిత అవరోధం. మన దేశంలో ఒక్కొక్క శాసనసభా నియోజకవర్గంలోను రెండున్నర లక్షలమంది నివసిస్తారు. లోక్ సభా నియోజకవర్గాల్లో నైతే 15 లక్షలకు తగ్గరు. ఆడ నియోజకవర్గాల్లో నాయకత్వ లక్షణాలున్న మగవాళ్ళు ఏం చెయ్యాలి ? వాళ్ళ నియోజకవర్గాన్ని స్త్రీలకు కేటాయించినట్లు ప్రకటించడమంటే వాళ్ళని కేవలం వోటర్లుగా మిగిలిపొమ్మని శాసించడమే కదా ! అప్పుడిది ప్రజాస్వామ్యమెలా అవుతుంది ? కేవలం మహిళా రిజర్వేషన్ పేరుతో కోట్లాదిమంది పురుషుల రాజకీయ హక్కుల్ని, నాయకత్వ హక్కుల్ని మూకుమ్మడిగా హరించడం కాదా ఇది ? ఇది ఆ నియోజక వర్గాలకు మాత్రం అంతిమంగా మేలు చేస్తుందా ?

Saturday, May 03, 2008

టి.వి.-సినిమా సమీక్షల బ్లాగులు మొదలుపెట్టండి !

చాలాకాలం క్రితం తెలుగు దూరదర్శన్ కుంటలో (అప్పట్లో అది నడిచిన స్థాయికి ఛానల్ అనే పదం వాడ్డం ఇష్టం లేదు) నెలకోసారి "జాబులూ, జవాబులూ" అని ఒక కార్యక్రమం వచ్చేది. ఆ నెలలో కుంటలో ప్రవహించిన కార్యక్రమాల మీద వీక్షకుల అభిప్రాయాలకూ, సందేహాలకూ, ఆకాంక్షలకూ స్టేషన్ డైరెక్టర్ గారు సమాధానాలిచ్చేవారు. అవేమీ సంతుష్టికరంగా ఉండేవి కావు గాని ఇప్పటి ప్రైవేటు ఛానళ్ళకంటే చాలా నయం.

ఇప్పుడున్న తెలుగుఛానళ్ళవాళ్ళెవరికీ తాము ప్రసారం చేస్తున్నకార్యక్రమాల బాగోగుల గుఱించి -మన - అనగా వీక్షకుల అభిప్రాయాలు అవసరం లేదు. అందుకే ఇప్పుడు మాటవరసకైనా జాబులూ లేవు, జవాబులూ లేవు, బుఱ్ఱ ఖరాబులే తప్ప ! వాళ్ళు తమ యిష్టమొచ్చినవి ప్రసారం చేస్తూంటారు. చచ్చినట్లు చూడ్డమే ఇప్పుడు మన పని. నాకర్థంకాని విషయం ఇంకొకటేమిటంటే మనం పెద్దగా విరగబడి చూడకపోయినా "మా యొక్క ఫలానా ధారావాహిక అదుర్స్ బెదుర్స్" అంటూ వాళ్ళకు వాళ్ళే నంది, పంది వగైరా అవార్డులు ఎలా ఇచ్చేసుకుంటున్నారా ? అని ! దీనిక్కారణం - టీవీ కార్యక్రమాల మీదా, సినిమాల మీదా ప్రజాభిప్రాయ నివేదన జరగాల్సినంతగా జరక్కపోవడం. ఇంతకాలమూ ఇలా ఉందంటే సరే ! కాని బ్లాగుల్లాంటి ప్రజామాధ్యమం విస్తరిస్తున్న దశలో కూడా మనం నచ్చని కార్యక్రమాల మీదా సినిమాల మీదా గొంతెత్తకపోవడం మంచిది కాదు. కాబట్టి ఆ ప్రస్తావనల మీద రాసే బ్లాగులు విఱివిగా పుట్టాలి.

ఇదివరకేమో గాని ఇప్పుడు మాత్రం వీడియో బ్లాగింగు చెయ్యడానికి అన్నీ మంచి శకునములే. ముఖ్యంగా బ్లాగర్ డాట్ కామ్ లో గత కొద్దినెలలనుంచి నేరుగా దృశ్యకాల (videos) ని టపా చేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టడం బ్లాగేతిహాసంలోనే ఒక చరిత్రాత్మక మలుపు. Youtube నుంచి జావా సంజ్ఞావళి (Java code) ని బ్లాగులో పొందుపఱచుకోవడం, మన బ్లాగు ముందు ససేమిరా అని మొఱాయించడం, మనమేమో దాని కాళ్ళూ గడ్డం పట్టుకుని నీచంగా బ్రతిమాలడం - ఈ పాతముచ్చటలకింక స్వస్తి. ఇదొక్కటే సరిపోదు. ఒక సినిమా గుఱించి మనం మన బ్లాగులో సమీక్ష రాయగలగాలంటే, రాసినా మన అభిప్రాయానికి పాఠకులు విలువివ్వాలంటే సదరు సినిమాలోని సన్నివేశాల్ని టూకీగా వారికి ప్రదర్శించి చూపాలి. లేదా కనీసం కొన్ని స్టిల్స్ అయినా టపా చెయ్యాలి. అదెలా చెయ్యాలో ఇక్కడ చర్చిస్తున్నాం.

ఇందుకు ముఖ్యంగా అవసరమైనది మన దగ్గర ఉన్న సి.డి./డి.వి.డి. ని మనకిష్టమైన విదంగా దృశ్యాలు దృశ్యాలుగా విడగొట్టుకుని భద్రపరచుకోగల వెసులుబాటు. దీనికోసం ప్రత్యేకవిధమైన సాఫ్టువేరు కావాలి. అదృష్టవశాత్తు Aone Software అనే సంస్థవారు అలాంటి సాఫ్టువేరుని చాలా చౌకగా కేవలం 25 అమెరికన్ డాలర్లకే అందిస్తున్నారు. దాని పేరు Ultra Video Splitter (ఇకముందు UVS అందాం). దాన్ని పరీక్షించగోరేవారు http://www.aone-soft.com/splitter.htm అనే లంకెలో దిగుమతి చేసుకోవచ్చు. దిగుమతి చేసుకున్నాక UVS తాలూకు ప్రతీకం (icon) ఒకటి మీ డెస్క్ టాప్ మీద కూర్చుంటుంది.

ఏవన్ వారి UVS సాఫ్టువేరుని ఉపయోగించే పద్ధతి :-

౧. మీరు దృశ్యాలుగా విడగొట్టదల్చుకున్న సినిమా తాలూకు సి.డి.ని మీ కంప్యూటర్ యొక్క సి.డి./డి.వి.డి. డ్రైవ్ లో చొప్పించండి.
౨. UVS icon మీద జమిలినొక్కండి. అప్పుడు Please Register Your Copy అని ఒక పెట్టె ప్రత్యక్షమౌతుంది. UVS ని కొనుక్కున్నవారి కంప్యూటర్లలో ఆ పెట్టె కనిపించదు. ఆ పెట్టెలో క్రింది భాగాన Try అని ఉన్న బొత్తాముపై నొక్కండి. UVS User Interface ప్రత్యక్షమౌతుంది. దాని ముందో వెనకో పైన చూపిన విధంగా మళ్ళీ ఇంకో విండో ప్రత్యక్షమౌతుంది. అందులో ఉన్న ఫైళ్ళ జాబితా కనిపిస్తుంది. వాటిల్లో MPEG అని ఉన్న ఫైలుని select చెయ్యండి.
౩. అప్పుడు పైన చూపిన విధంగా మళ్ళీ ఇంకో విండో ప్రత్యక్షమౌతుంది. అందులో ఉన్నదృశ్యాల జాబితా కనపిస్తుంది. వాటిల్లో ఎక్కువ మెగాబైట్లున్న దృశ్యాన్ని UVS లో ప్రదర్శనకు ఎంచుకోండి (click చెయ్యండి). అదే అసలు సినిమా.
౪. పైన కనిపిస్తున్న JPEG బొమ్మ UVS User Interface. ఇందులోని వివిధ భాగాల గుఱించి తెలుసుకుంటే దీన్ని ఇతోధికంగా ఉపయోగించుకోగలం. కొనుక్కున్న సాఫ్టువేరులో ఇంతకంటే ఎక్కువ సదుపాయాలుంటాయి.

(అ) పై బొమ్మలో కుడివైపున Help, Exit అనే icons కింద 1. Source File 2. Output Folder అని రెండు కాలమ్ లు ఉన్నాయి. వాటిని మీరు నింపనక్కఱలేదు. మీరు Open icon మీద నొక్కి ఎంచుకున్న ఫైళ్ళ యొక్క లొకేషనే దానంతటది Source File లోకి వచ్చేస్తుంది.

(ఆ) పై బొమ్మలో కింద ఎడంచేతివైపున తెల్లగా మీకొక Story bar కనిపిస్తుంది. సినిమా ఆడడం మొదలు కాగానే అదంతా నీలిరంగు బార్ గా మారిపోతుంది. ఆ బార్ కింద మీకు ఆఱు ప్రతీకాలు కనిపిస్తాయి. అవి-
1. Play 2. Pause 3. Stop = తెలిసినవే.

4. Mark Start Point = మీరు కత్తిరించదల్చుకున్న దృశ్యం దగ్గరికి సినిమా కథ వచ్చీ రాగానే మీరీ బొత్తాము మీద నొక్కెయ్యాలి (ఒక్కసారి మాత్రమే).

5. Mark End-point = మీరు కత్తిరించదల్చుకున్న దృశ్యం అయిపోవస్తూనే మీరీ బొత్తాము మీద నొక్కెయ్యాలి (ఒక్కసారి మాత్రమే).

6. Clear Mark = మీకు మీ దృశ్య ఎంపిక నచ్చక మళ్ళీ మొదటినుంచి మొదలుపెట్టదల్చుకుంటే దీనిమీద నొక్కాలి.

(ఇ) బొమ్మలో అన్నింటికంటే అట్టడుగున మీకొక Progress bar కనిపిస్తుంది. సి.డి. లోనుంచి విడగొట్టడానికి మనమెంచుకున్న దృశ్య ప్పని ఎంతవఱకు అయిందో అది ఆకుపచ్చ నిలువు చాఱలతో తెలియజేస్తుంది.

(ఈ) కొన్నిసార్లు నేరుగా UVS User Interface పైన ఎడంచేతివైపున గల Open అనే icon మీద నొక్కితే సి.డి./డి.వి.డి లోని ఫైళ్ళ వివరాలు గల విండో ప్రత్యక్షమౌతుంది. అక్కడ అన్నింటికంటే ఎక్కువ మెగాబైట్లు గల ఫైలుని select చేసుకుని Open అనాలి. అప్పుడు UVS Interface లో సినిమా ఆడడం మొదలౌతుంది.
౫. Mark End-point బొత్తాము మీద నొక్కాక Pause లేదా Stop బొత్తాము నొక్కాలి. అప్పుడు Story bar మీకు పై బొమ్మలో ఉన్న విధంగా కనిపిస్తుంది. బార్ లోని నీలిభాగం మీరు కత్తిరించిన దృశ్య పరిమాణానికి ప్రతిబింబం.
౬. అప్పుడు UVS User Interface పైభాగంలో ఉన్న ఈ Split బొత్తాము మీద నొక్కండి. UVS మీరు ఎంచుకున్న దృశ్యభాగాన్ని మెయిన్ సి.డి./డి.వి.డి నుంచి విడగొట్టడం మొదలుపెడుతుంది. ఆ పని తాలూకు ప్రగతి Interface కి అట్టడుగున ఉన్న progress bar లో ఈ క్రింది తెఱపట్టు (screen capture) మాదిరి సూచించబడుతుంది.
విడగొట్టడం పూర్తయ్యాక ఈ క్రింది సందేశపేటి (message box) వస్తుంది.
౭. విడగొట్టాక చెయ్యాల్సినది - విడగొట్టుకున్న దృశ్యానికొక ఫైలు పేరు కేటాయించి మన కంప్యూటర్ లో భద్రపఱచడం. అందుకోసం UVS interface లోని Output Folder కాలమ్ చివర్న గల icon మీద నొక్కాలి. అప్పుడు Choose Folder అంటూ ఒక విండో మీ కంప్యూటర్ లోని చిట్టాల్ని ఈ క్రిందివిధంగా ప్రదర్శిస్తుంది. ఇది వీడియోఫైలే అయినప్పటికీ అన్ని ఫైళ్ళలానే దీన్ని కూడా My Documents చిట్టాలో భద్రపఱచడం వల్ల ఎలాంటి నష్టమూ వాటిల్లదు. అలా select చేసి OK అనండి. భద్రపఱచడానికి మీరెంచుకున్న చిట్టా లొకేషను UVS యొక్క Output Folder లోకి వచ్చేస్తుంది.
౮. భద్రపఱిచాక సదరు వీడియోఫైలు యొక్క Thumbnail మీద కుడినొక్కు (right-click) నొక్కితే ఈ క్రింది పెట్టెలో మాదిరి దాని భోగట్టా యావత్తూ ప్రదర్శితమౌతుంది. ముఖ్యంగా అది ఎన్ని MB లు వచ్చిందో గమనించండి. ఆ Thumbnail మీదే జమిలి-నొక్కితే (ఉన్నవాళ్ళు) Windows Media Player లో మునుజూపు (Preview) చూసుకోవచ్చు :
౯. ఇప్పుడు మనం విడగొట్టిన సినిమా సన్నివేశాన్ని బ్లాగులోకి టపాచెయ్యడానికంతా సిద్ధమైనట్లే. చెయ్యాల్సిందల్లా మన బ్లాగు Compose Box లోకి వెళ్ళడం. అక్కడ Box పైన, చివర్నుంచి మూడో ప్రతీకమే (icon) వీడియో ఎగుమతుల కొఱకు ఉద్దేశించినట్టిది. (ఈ క్రింది బొమ్మ చూడండి). దాని మీద నొక్కండి.
౧౦. అప్పుడు ఈ క్రిందివిధంగా ఒక సంవాదపేటి వస్తుంది. ఇందులో Browse అనే బొత్తాము మీద నొక్కితే మీ కంప్యూటర్ లోని ఫైళ్ళు ప్రదర్శితమౌతాయి. వాటిల్లోంచి మీ అభిమాన సినీ-క్లిప్పింగుని ఎంచుకుని Video Title అనే వివరాన్ని నింపండి. దాని క్రింద I agree...etc. అని ఉన్నచోట నొక్కి UPLOAD VIDEO అనండి. మీ క్లిప్పింగు మీ బ్లాగులోకి ఎగుమతి కావడం మొదలవుతుంది. మీ వీడియో యొక్క పరిమాణాన్ని బట్టి ఆ ఎగుమతి ఎంత సమయమైనా తీసుకోవచ్చు కనుక వేచి చూడండి. తొందఱపడి వెబ్ పుట తిప్పెయ్యొద్దు. అంతగా అవసరమనుకుంటే ఇంకో విహారిణి (BROWSER) తెఱవండి. ఎగుమతయ్యాక కూడా మీ బ్లాగు Processing.... అంటూ తాత్సారం చేస్తుంది. భరించాలి. మీరు బ్లాగులో పెట్టదల్చుకున్న అన్నిదృశ్యాల ఎగుమతీ పూర్తయ్యాక వాటి మధ్యలో మీ పాఠ్యాన్ని (text) టైపు చెయ్యాలి.
౧౧. సాధారణంగా 5 నిమిషాల కంటే ఎక్కువ నిడివి గల దృశ్యాల జోలికి పోవద్దు. మీ జాలసంధానానికి ఎంత వేగం ఉన్నప్పటికీ బ్లాగర్ లోకి ఎగుమతి కావడానికి చాలాసేపు పట్టుతుంది. అదీగాక ఒకేసారి 100MB కంటే హెచ్చు పరిమాణం ఉన్నవీడియోలని బ్లాగర్ డాట్ కామ్ అనుమతించదు.

Tuesday, April 29, 2008

బ్లాగర్ డాట్ కామ్ బ్లాగుల్లోకి PDF కవిలెల పొందుపర్పు

బ్లాగరులు కాకముందే కవులూ, రచయితలైనవారికి ఎదురయ్యే బుఱ్ఱతొలుచు సమస్య - తమ పాతరచనల్ని తమ బ్లాగుల్లోకి ప్రచురించడం ఎలా ? అనేది. వాటన్నింటినీ మళ్ళీ అక్షరమక్షరమూ ఆసాంతం టైపుచేసి బ్లాగులోకి ఎక్కించడం చాలా కష్టం. అయితే ఇప్పటికే కంప్యూటరీకరింపబడి ఎలక్ట్రానిక్ గా భద్రపఱచబడ్డ ఫైళ్ళని మాత్రం మన బ్లాగులోకి యథాతథంగా ఎక్కించడానికి అవకాశముంది. ముందుగా గుర్తించాల్సిన విషయం - బ్లాగర్ డాట్ కామ్ కి చెందిన బ్లాగుల్లో స్వతహాగా పాఠ్యకవిలెల (text files) పొందుపర్పుకి వెసులుబాటు లేదు. అయినా సరే, అలా పొందుపఱచుకోవడానికి ఒక దివ్యమైన డొంకతిరుగుడు ఉపాయం లేకపోలేదు. ఇంకో విషయం - ఇక్కడ సూచిస్తున్న మార్గం కేవలం ఆతిథ్యం పొందే బ్లాగులకే కాక స్వతంత్ర సాలెగూళ్ళ(Websites)క్కూడా అక్కఱ కొస్తుంది. స్వతంత్ర గూళ్ళకు ఇలాంటి ఉపాయాల అవసరం ఏమిటంటారా ? మన సైటుకు కేటాయితమైన జ్ఞాపకజాగా (allotted memory space)ని పొదుపు చేసుకోవచ్చు.

ఏయే ఫైళ్ళని ఎక్కించగలం ? :- అది scribd వారు అనుమతించిన సంప్రకారాల్ని (file formats) బట్టి ఉంటుంది. సాధారణంగా MS-Word, Open Office, PDF, JPEG, GIF ఫైళ్ళన్నీ నిరాటంకంగా ఎగుమతవుతాయి

మనం చెయ్యాల్సింది ఇది :-

1.ముందుగా http://scribd.com/ సైటులోకెళ్ళి ఉచితంగా sign up అవ్వండి. మీ సంకేతపదాన్ని (password) మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.

2. అక్కడ వెబ్ పుట పైన upload అనే బొత్తాము (బటన్) ఉంటుంది. దాని మీద నొక్కండి. ఆ సైటులోనే upload పుట ఒకటి తెఱుచుకుంటుంది.

3. అందులో మళ్ళీ ఇంకో Click here to upload/browse బొత్తాము ఉంటుంది. దానిమీద నొక్కండి. అప్పుడు మీ కంప్యూటర్ లో ఉన్న My Documents చిట్టా తాలూకు మెన్యూ విండో ప్రత్యక్షమౌతుంది. అందులో మీక్కావాల్సిన PDF file ఎంచుకోండి. open అనండి. సదరు ఫైలు scribd.com లోకి ఎగుమతి కావడం మొదలవుతుంది.

4. ఎగుమతి పూర్తయ్యేదాకా వేచిచూడండి. పూర్తయ్యాక అదే వెబ్ పుటలో publish అనే column ప్రత్యక్షమౌతుంది. అక్కడ మీరు తప్పనిసరిగా నింపాల్సిన వివరాలు :

౧. మీ ఫైలు పేరు

౨. ఫైలు గుఱించిన వివరణ

౩. ఫైలుకివ్వాల్సిన Tag

౪. ఫైలు కేటగరీ ఎంపిక.

వీటిల్లో మొదటి రెండూ మీరు తెలుగులోనే చెయ్యడానికి అవకాశం ఉంది. మీరు కేటగరీ నింపకపోతే scribd.com వాడే తన యిష్టమొచ్చిన Default Category కేటాయిస్తాడు. అది ఖచ్చితంగా బావుండదు.

5. ఇవన్నీ నింపాక Publish అని నొక్కండి. మీ ఫైలు scribd.com లోకి ఎక్కినట్లే ! ఎక్కినట్లు తెలియజేస్తూ ఇంకో వెబ్ పుట తెఱుచుకుంటుంది కూడా.

6. scribd.com వెబ్ పుట పైభాగంలో కనిపించే మీ User-name మీద నొక్కితే మీ వ్యక్తిగత scribd ఖాతాల పుటలోకి వెళతారు. అక్కడ మీరు ఎగుమతి చేసిన ఫైలు కనిపిస్తుంది. దానిపేరుమీద నొక్కితే ఇంకో వెబ్ పుట తెఱుచుకుంటుంది.అక్కడ మీ ఫైలు i-Paper software వారి ప్రత్యేక విండోలో పైకీ కిందికీ బద్దలతో జరుపుకొని చూసుకోవడానికి వీలుగా దర్శనమిస్తుంది.

7. దానిపక్కనే సదరు ఫైలు తాలూకు Embed code (Scribd.com వారు కేటాయించినది) కనిపిస్తుంది. దాన్ని copy చేసి మీ బ్లాగు యొక్క Compose Box లో అతికించండి. Publish అనండి. ఇప్పడు మీ బ్లాగు యొక్క బహిరంగ పుటలో ఆ ఫైలు యావత్తూ Youtube మాదిరి ప్రత్యక్షం. మీ పాఠకులు దానికున్న బద్దతో పైకీ కిందికీ జరుపుకుని మొత్తం ఫైలుని చదువుకుంటారు. ఉదాహరణకు నా బ్లాగులో నేను పెట్టిన ఫైలుని ఈ కిందిలంకెలో చూడవచ్చు.

http://naasaahityam.blogspot.com/2007/03/jpeg_19.html

ఇదంతా మొదట్లో అదో మాదిరిగా అనిపించవచ్చు. పోను పోను మీరే ఆస్వాదిస్తారు. కొన్నిసార్లు "మీరు embed చేసిన కోడ్ బాలేదు గట్రా" అంటూ మీ బ్లాగు మిమ్మల్ని సతాయించవచ్చు. అయినా నిరుత్సాహపడకుండా పాతకోడ్ చెఱిపేసి కొత్తకోడుతో ప్రయత్నిస్తూ విజయులం కావాలి.